ఎదురెదురు ద్విచక్ర వాహనాల ఢీతో విషాదం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
వివరాల ప్రకారం, చౌడమ్మ కొండూరు గ్రామానికి చెందిన కొడుపల సాగర్ (30) మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో నందిపేట్ నుంచి కొండూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొనడంతో సాగర్ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తి శివ (28) తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శివను అత్యవసర చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద ఘటనపై స్థానిక ఎస్సై శ్యామ్‌రాజు కేసు నమోదు చేశారు. మృతి చెందిన సాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share