వాకింగ్ పేరుతో భర్తను చంపిన భార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య ఘటన మరువకముందే.. మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మూడు నెలలకే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకోగా, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ఆశిష్, అంజు భార్యాభర్తలు. వీరిద్దరికీ మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. గత శుక్రవారం ఉదయం ఆశిష్ తన భార్య అంజుతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలోనే ముందే ప్లాన్ చేసిన ప్రకారం అంజు తన ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి ఆశిష్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం ప్రియుడు, మరో ఇద్దరు ఆశిష్ వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే అంజు మాత్రం అక్కడే ఉండిపోయి.. ఇది ప్రమాదవశాత్తు జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆశిష్ మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే భార్య అంజు ప్రవర్తన పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించడంతో ఆమెను లోతుగా విచారించారు. విచారణలో ఆమె చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు మరింతగా ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. భర్తను హత్య చేయడానికి ముందే పెద్ద స్కెచ్ వేసినట్టు తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share