తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు మోత మోగిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి, ఇరువురు నేతలపైనా తీవ్ర విమర్శలు చేశారు. తమ ముఖ్యమంత్రిని విమర్శిస్తే తాము కూడా ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
రఘునందన్ రావు గురించి మాట్లాడుతూ, ఆయనను రాజకీయంగా చిన్నవాడిగా పేర్కొన్నారు. మెదక్‌లో ఆయన గెలిచేందుకు బీఆర్ఎస్ లోపలి కుట్రలే కారణమని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావులు మౌనంగా ఉండటంతోనే రఘునందన్ ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. “మీరు మా సీఎం గురించి మాట్లాడకండి, నేను కూడా మీ ప్రధాని గురించి మాట్లాడను” అంటూ అల్టీమేటం జారీ చేశారు.
ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలపై కూడా జగ్గారెడ్డి ప్రశ్నలు గుప్పించారు. నల్లధనం తిరిగి తీసుకొచ్చి ప్రజలకు పంచుతామన్న హామీ ఏమైందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ప్రకటనకు ఏమైందని నిలదీశారు. ప్రధాని మోదీని “మోసగాళ్లకు మోసగాడు” అని తాము అనిపించుకోకూడదనుకుంటే, బీజేపీ నేతలు కూడా తగిన మట్టికే మాట్లాడాలని సూచించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన సినిమా డైలాగులు చదివినట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనను తక్కువగా చూడొద్దని, ఒకే ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి వాగ్దానాలను అమలు చేయగలిగిందని వివరించారు. తమ పనులు తమకే గర్వకారణమని, ప్రచారం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.









