బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కి మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో మే 30న లండన్‌లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ‘ఐడియాస్ ఫర్ ఇండియా – 2025’ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు బ్రిడ్జ్ ఇండియా సంస్థ కేటీఆర్‌ను ఆహ్వానించింది. లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో పాలిసీ మేకర్లు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, సాంకేతికతలో ముందుండే విధానాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. దేశానికి దిశానిర్దేశం చేసే విధంగా ఆయా రంగాల్లో తీసుకున్న చర్యలు, నిర్వహించిన ప్రాజెక్టులను వివరించే అవకాశం ఈ వేదికగా కలుగనుంది. ఇదివరకే ఆయన ‘డబాస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం’, ‘ఇండియా అట్ 75’ వంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని తన విశ్లేషణతో ఆకట్టుకున్నారు.
ఇక అదే రోజు, లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సంస్థ ‘ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్’ (PDSL) తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించింది. యూకేలోని వార్విక్ టెక్నాలజీ ఫార్మ్‌లో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాన్ని మే 30న వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లో కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇన్నోవేషన్, పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడంలో కేటీఆర్ చూపిన దీక్షను గుర్తించిన సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల ఆయన చేతుల మీదుగా తమ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం తమ బిజినెస్ దృష్టిలో కీలకమైన మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల పరంగా కేటీఆర్ వినూత్న దృక్పథం పలువురికి ప్రేరణగా నిలుస్తోంది.









