KLSR కేసులో సీఎం పాత్రపై కేటీఆర్ దాడి

రేవంత్ రెడ్డి ఒక బినామీ చీఫ్ మినిస్టర్ అని, వేరే వాళ్ల కోసం తెలంగాణలో ఆయన పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన వెనకుండి నడిపించే వాళ్లు వేరే ఉన్నారని, వాటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని కేటీఆర్ హెచ్చరించారు.
KLSR ఇన్ఫ్రా టెక్ బాగోతం సుప్రీంకోర్టు నోటీసులతో వెలుగులోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. 2018లోనే ఆ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయని, 2023లో ఆ సంస్థ దివాళా తీసిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల టెండర్లు ఎలా ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న సొంత కారు కూడా KLSR ఇన్ఫ్రా టెక్ కంపెనీ పేరుమీదే ఉందని కేటీఆర్ ఆరోపించారు. KLSR అనేది సాక్షాత్తూ రేవంత్ బినామీ కంపెనీ అని, గత రెండేళ్లుగా తన అక్రమ సంపాదనను ఆ సంస్థ ద్వారా మళ్లిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా సీఎం సీట్లో కూర్చొని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదే కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు.
దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇచ్చారన్న అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవహారంపై CBI, SFIO లేదా EDలో ఏదైనా ఒక దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని జనవరి 23న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share