పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికలో మరింత దిగజారడం ఖాయమని స్పష్టంగా సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండేళ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పల్లె ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో విఫలమై, ప్రధాన ప్రతిపక్షంపై అడ్డగోలు విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ వైఫల్యాలకు అద్దం పట్టిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, బల ప్రయోగం, హింసను ఎదుర్కొని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఎప్పుడూ కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయేనని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని తెలిపారు. బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాధారణ విజయం కాదని, చరిత్రలో నిలిచిపోయే పోరాటమని పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం 117 గ్రామ పంచాయతీల్లో 80 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని వినియోగించినప్పటికీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే గెలవగలిగిందని, బీజేపీ 13 గ్రామ పంచాయతీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు బీఆర్ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని పేర్కొంటూ, ప్రజలకు మరియు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.









