డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యత అనే మాట అర్థం కోల్పోతున్న పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో పాటు వ్యక్తుల ప్రైవసీ కూడా తీవ్రమైన ప్రమాదంలో పడుతోంది. ఏ క్షణంలో, ఏ రూపంలో మన వ్యక్తిగత క్షణాలు బహిర్గతమవుతాయో ఊహించలేని స్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఈ భయానక వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేసింది.
హాంకాంగ్‌కు చెందిన ఎరిక్ (ఇది అతడి అసలు పేరు కాదు) తన ప్రియురాలితో కలిసి 2023లో దక్షిణ చైనా షెన్‌జెన్‌లోని ఓ హోటల్‌లో బస చేశాడు. ఆ ప్రయాణం పూర్తయ్యాక ఇద్దరూ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఎరిక్‌కు తరచుగా అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేసే అలవాటు ఉంది. అలానే ఓ రోజు ఓ పోర్న్ సైట్ చూస్తుండగా ఓ వీడియో అతడి దృష్టిని ఆకర్షించింది. అందులో కనిపించిన సన్నివేశాలు తనకు చాలా పరిచయంగా అనిపించాయి.
వీడియోను గమనిస్తూ చూస్తుండగా ఎరిక్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో ఉన్న వ్యక్తులు తాను, తన ప్రియురాలేనని గుర్తించాడు. తాము షెన్‌జెన్‌లో హోటల్ గదిలో గడిపిన ఏకాంత క్షణాల వీడియోనే అది అని నిర్ధారించుకున్నాడు. తమకు తెలియకుండానే హోటల్ గదిలో రహస్యంగా ఈ వీడియోను రికార్డు చేసి, అడల్ట్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశారని అర్థం కావడంతో అతడు తీవ్రంగా కలత చెందాడు.
ఇన్నాళ్లు పోర్న్ వెబ్‌సైట్‌కు కేవలం వీక్షకుడిగా ఉన్న ఎరిక్, ఒక్కసారిగా బాధితుడిగా మారిపోయాడు. ఈ ఘటన తనను మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని, ఇది ఎంత భయానకమైన అనుభవమో అని అతడు ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాడు. ఈ ఘటన డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంత సున్నితమైన అంశమో, అలాగే హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రైవసీపై మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తోంది.









