గోప్లాపూర్‌లో మంత్రి జూపల్లికి గ్రామస్తుల వ్యతిరేకత

Villagers in Goplapur protested Minister Joopalli shouting “Go Back.” Tensions rose as locals questioned Congress candidate selection and local development.

తెలంగాణ రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్న నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇబ్బంది ఎదురైంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారార్థం గ్రామానికి చేరుకున్న మంత్రిని గ్రామస్తులు వ్యతిరేక నినాదాలతో ఎదుర్కొన్నారు. గో బ్యాక్ జూపల్లి అంటూ నినాదాలు చేస్తూ గ్రామస్తులు మంత్రిపై తమ అసంతృప్తిని బహిర్గతం చేశారు.

ప్రచార సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, తాను 40 ఏళ్లుగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. తన గ్రామ నాయకులు రోజు రోజుకు మాట మార్చేలా తాను ఎప్పుడూ పార్టీలు మార్చలేదని చెప్పిన సమయంలో గ్రామస్తులు అతని మాటలను అడ్డుకున్నారు. ఒక్క సందర్భంలోనే పార్టీ మార్చిన ఘన చరిత్ర మంత్రిది అని, తమ నాయకులది కాదని గ్రామస్తులు సూటిగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామంలో సరైన సర్పంచ్ అభ్యర్థి కూడా లభించక, బీఎర్సెస్ హయాంలో బీసీ బందు తీసుకున్న మహిళకు టికెట్ ఇచ్చారని ఆరోపిస్తూ మంత్రిపై విమర్శలు గుప్పించారు.

గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని, ఓటమి భయంతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చారని గ్రామస్థులు మంత్రిని ప్రశ్నించారు. గత రెండు దశాబ్దాలుగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ ప్రాంతంలో అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. నీటి సమస్య, రోడ్లు, మౌలిక సదుపాయాల పేరుతో ఎన్నో వాగ్దానాలు చేసినా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు మంత్రి సమాధానం ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

గ్రామంలో పరిస్థితులు ఉద్విగ్నంగా మారిన నేపథ్యంలో జూపల్లి అభిమానులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. మంత్రికి వ్యతిరేకంగా ‘డౌన్ డౌన్’ నినాదాలు చేస్తూ గ్రామస్తులు నిరసనను కొనసాగించారు. పరిస్థితి మరింత వేడెక్కుతుండడంతో మంత్రి జూపల్లి వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. గ్రామంలో ఏర్పడిన ఈ అనూహ్య పరిస్థితులు రాబోయే సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share