మున్సిపల్ ఎన్నికల వేళ మండలంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరకాల పట్టణంలోని 22 వార్డుల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని 19వ వార్డు వికాస్ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
వికాస్ నగర్ కాలనీలో ఇండ్ల పక్కన ఉన్న కట్టెల పొదల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు పడేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ప్రచార సమయంలో జెండాలు ఇలా నిర్లక్ష్యంగా పడేయడం వెనుక అంతర్యం ఏమిటని కాలనీవాసులు వాపోతున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్యా? లేక అంతర్గత అసంతృప్తి ఫలితమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆ వార్డులో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌పై అసంతృప్తి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ కాలనీలో సంక్షేమ పథకాలు సరిగా అందలేదన్న ఆరోపణలు రావడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వార్డు అభ్యర్థిపై, పార్టీ పనితీరుపై కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ప్రచార జోరులో అధికార పార్టీ జెండాలు కట్టెల పొదల్లో పడేయడం కాంగ్రెస్ పార్టీకి ఆ వార్డులో ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. ప్రజలు పార్టీని నచ్చలేదనే భావనలో ఉన్నారా? లేక రాజకీయ ప్రత్యర్థుల వ్యూహమా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పరకాల మున్సిపల్ ఎన్నికల రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.









