నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఇలా త్రిపాఠీని కొత్త కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి కొద్ది నెలలే గడవకముందే బదిలీ కావడం జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తక్కువ కాలంలోనే ఆయన బదిలీ కావడంపై పలు అనుమానాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వినయ్ కృష్ణారెడ్డిని జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్ జోన్‌లకు అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. కీలకమైన నగర పరిపాలనా బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కొత్తగా నియమితులైన ఇలా త్రిపాఠీ పరిపాలనలో చురుకైన అధికారిగా పేరొందారు. నల్గొండ జిల్లాలో ఆమె పనితీరుకు మంచి గుర్తింపు లభించిందని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది.









