ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే శాఖల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఆస్తి లావాదేవీల ద్వారా రోజూ లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. అయినప్పటికీ చేవెళ్ల, శంకర్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించినా, నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు.
చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. కొత్త వెంచర్లు, భూముల కొనుగోలు–అమ్మకాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రోజూ వందల మంది వస్తున్నారు. ముఖ్యంగా సీజన్ సమయంలో కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. అయితే కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూర్చునే సదుపాయం లేక రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు గంటల తరబడి నిల్చునే పరిస్థితి నెలకొంది.
ఈ సమస్య మహిళలు, వృద్ధులకు మరింత కష్టంగా మారింది. వేడి, వర్షాకాలంలో అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సిబ్బందికీ పని చేసే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వానికి నిరంతర ఆదాయం తీసుకొస్తున్న కార్యాలయాల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల కోర్టు సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దాదాపు పదేళ్ల క్రితం రూ.62 లక్షలు మంజూరైనా, కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అయ్యప్ప స్వామి ఆలయం పక్కన ఉన్న అద్దె భవనంలోనే కార్యాలయం కొనసాగుతోంది. శాశ్వత భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.









