గత పాలకులపై పొంగులేటి నిప్పులు

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. “రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. మీ ఆశీర్వాదాలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా” అని ఆయన అన్నారు. ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి వచ్చానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు.
బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా గత పాలకుల పాలనపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు పదేళ్ల ‘రావణాసుర’ పాలనకు ముగింపు పలికి, ప్రజా పరిపాలనను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. “మంచి ఉన్నంత కాలమే మర్యాద ఉంటుంది.. అది లేనప్పుడు యుద్ధం చేయాల్సిందే” అని ఆయన అన్నారు. ప్రజలే మార్పు కోరుకుని ఓటుతో బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, పేదల ఇళ్లకన్నా దొరల ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. కనీసం హాస్టల్ విద్యార్థులకు సరిగా భోజనం పెట్టలేని వారు నేడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. అలాంటి వారిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share