1. ఎండల కాటుకు ఉపశమనం కనిపించనుందా?
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా నమోదు అవుతున్నాయి. ఉదయం పది దాటితేనే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వేడి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలకు శుభవార్త చెప్పింది. మే 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
2. అల్పపీడన ప్రభావంతో వర్షాల సూచన
దక్షిణ భారత సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
3. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్
నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, నారాయణపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
4. ఉష్ణోగ్రతల్లో తక్కువకే అవకాశం
ఈ వర్షాల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే సూచనగా చెబుతున్నారు. వేడి తీవ్రత తగ్గినా, రానున్న వర్షాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.









