స్వప్న హత్యను ఖండించిన రామన్నపేట బార్

మొయినాబాద్‌లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను రామన్నపేట బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దారుణ ఘటనకు నిరసనగా గురువారం రామన్నపేటలో న్యాయవాదులు విధులను పూర్తిగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మజీద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరంతరం అడ్వకేట్లపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్తి వివాదాల కోసం హింసాత్మక దాడులు, హత్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆస్తి సంబంధిత సమస్యల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాల్సిన బదులు హత్యలకు దిగడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో యువ న్యాయవాది స్వప్న మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ న్యాయవాదులు నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు యాదాసు యాదయ్యతో పాటు సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share