దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమాజ న్యాయానికి దోహదపడే చర్యగా పేర్కొన్నారు.
ఈ నిర్ణయం రాహుల్ గాంధీ దార్శనికతకు న్యాయం చేస్తుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాహుల్ కేంద్రాన్ని ప్రభావితం చేయగలిగారని కొనియాడారు. దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రంలోనే కుల గణన చేపట్టామని, అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలయ్యే దశకు చేరిందని గుర్తు చేశారు.
కుల గణనపై కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా పోరాటం సాగిస్తోందని, ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో సైతం నిరసనలు నిర్వహించారని ఆయన తెలిపారు. రాష్ట్రం తీసుకున్న చొరవ దేశానికి మార్గదర్శిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. “తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది” అనే వాఖ్యాన్ని మరోసారి ఉద్ఘాటించారు.
ఇదే విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం అని స్పష్టం చేశారు. సామాన్య జన గణనతో పాటు కులాల వారీగా గణాంకాలు సేకరించడం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఒత్తిడి, కాంగ్రెస్ ఉద్యమం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.









