చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈ నెల 11న నిర్వహించిన సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఓటమిపాలైన అభ్యర్థి రుద్రారపు బిక్షపతి ఆరోపించారు. ప్రజలు తనకు స్పష్టమైన మద్దతు ఇచ్చినప్పటికీ, అధికార పార్టీ ఆధ్వర్యంలో రిగ్గింగ్ జరిగి తమ అన్యాయం బయటపడకుండా ప్రయత్నించారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే పని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సవ్యంగా సాగినప్పటికీ, లంచ్ బ్రేక్ పేరుతో 1 గంట నుంచి 2 గంటల మధ్య జరిగిన మార్పులు ఎన్నిక ఫలితంపై ప్రభావం చూపాయని బిక్షపతి తెలిపారు. ఏజెంట్లందర్నీ బయటకు పంపించి బ్యాలెట్ బాక్సులను తెరిచి తనకు పడ్డ కత్తెర గుర్తు బ్యాలెట్ పత్రాలను తొలగించి, అధికార పార్టీ అభ్యర్థి రింగు గుర్తుకు ఓట్లు వేసి బాక్స్‌లో వేసినట్లు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి అని తీవ్రంగా పేర్కొన్నారు.
తమ గుర్తుకు పడ్డ వందలాది బ్యాలెట్ పేపర్లను పోలింగ్ స్టేషన్ వెనుక ఉన్న డ్రైనేజీలో పడేసినట్లు చెప్పిన బిక్షపతి, అక్కడ సుమారు 300 పైగా తమ ఓట్లు కట్టలుగా దర్శనమిచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని తాము ప్రత్యక్ష సాక్ష్యాలతో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, ఎన్నికలను రద్దు చేయించేందుకు చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజల నిజమైన తీర్పును అమలు చేయకుండా డబ్బు, అధికారంతో ఫలితాలు మార్చే ప్రయత్నాలు తీవ్రంగా ఖండించారు.
అప్రజాస్వామికంగా గెలిచిన అధికార పార్టీ అభ్యర్థిని తాము అంగీకరించబోమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ప్రజల్లో విశేష ఆదరణ పొందిన బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టంగా గెలిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ, కుట్రలు పన్ని ఫలితాలను తమవైపు తిప్పుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అన్యాయం పై కలెక్టర్‌కి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసి, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి చివరి వరకు పోరాడతామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే ఇలాంటి చర్యలను నిలువరించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.









