హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల విషయంలో పూర్తి మద్దతు ఇస్తున్నారని, కాబట్టి నిధుల గురించి ఆలోచించకుండా పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.
“ప్రమోషన్లు, పోస్టింగ్లు అన్నీ సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో పూర్తి చేశాం. ఇప్పుడు మీరంతా ఫలితాలు చూపించాల్సిన సమయం వచ్చింది” అని మంత్రి అధికారులను ఉద్దేశించి స్పష్టం చేశారు. శాఖ పరిధిలోని అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, ఏ విషయంలోనూ జాప్యం తగదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాలని ఆదేశించారు.
చీఫ్ ఇంజినీర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనుల నాణ్యతను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి సమీక్ష సమావేశానికి పనుల పురోగతిపై స్పష్టమైన నివేదికతో హాజరుకావాలని ఆదేశించారు. పనుల్లో ఏమైనా సమస్యలు ఎదురైనా వెంటనే తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. పనుల్లో సమయం విలువ పెరుగుతోందని, అందుకే ప్రతీ రోజు సమర్థంగా ఉపయోగించుకోవాలని మంత్రి హితవు పలికారు.
రాష్ట్రంలో రహదారులు, ఆసుపత్రులు, ఇతర ప్రాజెక్టుల కోసం నిధుల కొరత లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడానికి అందరూ కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల్లో హ్యామ్ రోడ్ల ప్యాకేజీలపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని, రోడ్లపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లు, వర్టికల్ కర్వ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లకు స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు.









