భాగ్యనగరంలో వివేకానంద చారిత్రక అడుగులు

స్వామి వివేకానంద వాక్కు యావత్ ప్రపంచాన్ని కదిలించిన మహాశక్తిగా చరిత్రలో నిలిచింది. భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయుడు తొలిసారి భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ హైదరాబాద్ రామకృష్ణ మఠం శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకొచ్చింది.
1893లో స్వామి వివేకానందుడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం భారత ఉపఖండంలోనే తొలి ప్రసిద్ధ పబ్లిక్ లెక్చర్‌గా చరిత్రలో నిలిచింది. ఆ ఉపన్యాసం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, మానవ విలువలపై అవగాహన పెంపొందించే సందేశాన్ని ఆయన అందించారు. ఈ ఉపన్యాసం ఆయన ప్రపంచవ్యాప్త ఖ్యాతికి నాందిగా భావిస్తారు.
ఈ నేపథ్యంలో ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో రామకృష్ణ మఠం హైదరాబాద్ శాఖ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిని నిర్వహిస్తోంది. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటనను గుర్తు చేసుకుంటూ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. యువత, విద్యార్థులు, భక్తులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు.
ఈ సప్తాహ కార్యక్రమాల ద్వారా స్వామి వివేకానంద జీవితం, ఆయన బోధనలు, భారతీయ ఆధ్యాత్మిక విలువల ప్రాముఖ్యతను నేటి తరానికి చేరవేయాలన్నదే నిర్వాహకుల లక్ష్యంగా ఉంది. ఆత్మవిశ్వాసం, సేవా భావం, మానవత్వం వంటి విలువలను యువతలో నాటేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని రామకృష్ణ మఠం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share