తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించడంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం, హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు కొత్తగా ఏర్పాటు చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్ పూర్ తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న IT, పారిశ్రామిక ప్రాంతాలు వస్తాయి.
మల్కాజ్ గిరి కమిషనరేట్‌లో కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి వంటి ప్రాంతాలు చేర్చబడ్డాయి. రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీ నియమించారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు చేరాయి. ఈ కొత్త కమిషనరేట్లకు సంబంధించి సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డి, మల్కాజ్ గిరి సీపీగా అవినాశ్ మహంతి, ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.









