తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియపై అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, హాల్ టికెట్ నంబర్ల క్రమంలో కొన్ని సమానమైన మార్కుల లాభం, తుది మార్కుల జాబితా ఆలస్యంగా విడుదలైన అంశాలను ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారంలో పారదర్శకత లేనట్టు అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అనుసరించిన మూల్యాంకన విధానాలపై పలు కీలక ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థులకి తక్కువ మార్కులు రావడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, ఈ అభ్యర్థుల జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారనే అంశాన్ని వివరంగా వివరణ ఇవ్వాలని కోరింది.
ఇది రాతపూర్వక పరీక్ష అయినందున మూల్యాంకన నిపుణులకు ‘కీ’ పేపర్ ఇవ్వలేదని, వారి సబ్జెక్ట్ నైపుణ్యంతోనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాదులు కోర్టులో వివరించారు. అయితే, హైకోర్టు మాత్రం వివరణలపై పూర్తిగా సంతృప్తి చెందకుండా, తెలుగు మాధ్యమ అభ్యర్థుల వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
తెలుగు మాధ్యమంలో ఎంతమంది పరీక్ష రాశారు, తుది జాబితాలో ఎంతమంది ఉన్నారు వంటి సమాచారాన్ని తదుపరి విచారణకు ముందు కోర్టుకు అందించాలని సూచించింది. నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో, విచారణను త్వరితగతిన ముగించాలన్న అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది









