హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ఇద్దరిని సుల్తాన్ బజార్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించిన వివరాల ప్రకారం, కోఠి బడిచౌడి ప్రాంతానికి చెందిన సరస్వతికి ముదిరాజ్ కమ్యూనిటీ సమావేశంలో ఉసికేల విజయ్ పరిచయమయ్యాడు. ఈ సందర్భంగా తనకు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆమెను నమ్మించాడు.
తన స్నేహితుడు అంబం మురళిని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సరస్వతితో పాటు మరో 18 మంది నుంచి మొత్తం రూ.39 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు అందరూ త్వరలోనే ఇళ్లు వస్తాయన్న నమ్మకంతో డబ్బులు చెల్లించారు.
కొంతకాలం తర్వాత సరస్వతితో పాటు 18 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల అలాట్మెంట్ పత్రాలు అందజేశారు. అయితే ఈ పత్రాలపై అనుమానం వచ్చి ఆరా తీయగా, అవి పూర్తిగా ఫోర్జరీ చేసినవని తేలింది. దీంతో మోసపోయిన బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంటనే సరస్వతి సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఉసికేల విజయ్, అంబం మురళిని అరెస్టు చేశారు. ఈ ఇద్దరిపై గతంలో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో మోసాలు చేసిన కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాలకు ప్రజలు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ పథకాల విషయంలో అధికారిక మార్గాల ద్వారానే సమాచారం పొందాలని పోలీసులు సూచించారు.









