వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రగతిభవన్ వేదికగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కృష్ణా, గోదావరి నదీజలాల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ప్రజెంటేషన్‌కు హాజరుకానుండగా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర జలవిధానంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
గత పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి, బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందున్న కేసుల స్థితిగతులపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం చేసిన రాజీలు, అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా విఘాతం కలిగించాయన్న అంశాలను ఆధారాలతో సహా వివరించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో కృష్ణా, గోదావరి జలాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, అధికార పార్టీ నేతలందరికీ ముందుగానే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పీపీటీ నిర్వహిస్తున్నారు. 2, 3వ తేదీల్లో అసెంబ్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో, అంతకుముందే పార్టీ నేతలు ఒకే వాయిస్‌తో మాట్లాడేలా సిద్ధం చేయడం ఈ సమావేశం లక్ష్యంగా ఉంది.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాలపై ఉన్న హక్కులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపై ప్రభుత్వ దృష్టి వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. జల వివాదాల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు ఈ ప్రజెంటేషన్ కీలకంగా మారనుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.









