తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్తగా ఉండాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఘాటుగా హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు మోడీని విమర్శించే హక్కు లేదని అన్నారు.
కొత్తకోట పట్టణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, రాష్ట్రంలో ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసునని డీకే అరుణ పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఒక్క సీటైనా గెలుచుకుని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్రం నిధులు లేకుండా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేరని స్పష్టం చేశారు.
కొడంగల్ నుంచి అర్ధరాత్రి రేవంత్ రెడ్డిని గుంజుకుపోయి కేసీఆర్ జైల్లో వేశారని, ఇప్పుడు అదే కేసీఆర్ను కాపాడే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నిజంగా కక్షసాధింపు చేయాలనుకుంటే ఓటుకు నోటు కేసే సరిపోతుందని, కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయదలచుకోలేదని తెలిపారు. శత్రుదేశాల కుట్రలను ప్రధాని మోడీ తిప్పికొడుతుంటే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాల్లో దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద కొత్తకోట మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసిందని, పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని డీకే అరుణ తెలిపారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిందేనని, పట్టణంలో కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్చార్జి డోకూర్ పవన్ కుమార్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి, ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.









