సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని జమల్పూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. వ్యవసాయ పనుల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన యువకుడు మాదాపూర్ గ్రామానికి చెందిన జగదీష్ (18)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జమల్పూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ పొలంలో పత్తి కట్టెను రొప్పించే పనుల కోసం జగదీష్ ట్రాక్టర్‌తో అక్కడికి వెళ్లాడు. పొలంలో పని చేస్తున్న సమయంలో ట్రాక్టర్ అనుకోకుండా అక్కడ ఉన్న కరెంట్ స్తంభానికి మద్దతుగా ఏర్పాటు చేసిన సపోర్ట్ వైరును తాకింది.
దీంతో కరెంట్ స్తంభం ఒక్కసారిగా విరిగి, ట్రాక్టర్ నడుపుతున్న జగదీష్ తల మరియు మొండెం మీద పడింది. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.









