మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

చేర్యాల ప్రాంతం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజల కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లోని 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కౌన్సిల్‌కు పంపాలని వారు ప్రజలను కోరారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, గెలుపు సాధించిన వెంటనే అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
చేర్యాల ప్రాంతాన్ని ముక్కలు చెక్కలుగా చేసి ప్రజలను ఆగం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి సీతక్క విమర్శించారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
అంతకు ముందు చేర్యాల పట్టణ కేంద్రంలో గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు, మండల–పట్టణ అధ్యక్షులు కొమ్మురవి, దాసరి శ్రీకాంత్‌తో పాటు నాయకులు కొమ్ము నర్సింగరావు, ఆడేపు నరేందర్, తాటికొండ సదానందం, అందే నాని, దాసరి కళావతి తదితరులు పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share