మేడ్చల్ జిల్లా షామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట శివారులో నకిలీ పత్రాలతో భారీ స్థాయిలో భూకబ్జా జరుగుతోందని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. 323 నుంచి 409 సర్వే నంబర్ల పరిధిలో మొత్తం 1049 ఎకరాల భూమిని 1965లో మీర్ రహమత్ అలీ తదితర ఆరుగురి నుంచి దుగ్గిరాల బలరామకృష్ణ కొనుగోలు చేసినట్లు రికార్డులు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన వివరించారు.
ఆ భూమి బలరామకృష్ణ వారసులు అయిన దుగ్గిరాల అమరేందర్ బాబు సహా మరో 20 మంది పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని జడ్సన్ పేర్కొన్నారు. వీరంతా పార్టిషన్ డీడ్, మ్యూటేషన్ తదితర ప్రక్రియల ద్వారా భూమిపై న్యాయపూర్వక హక్కులు పొందారని తెలిపారు. అంతేకాకుండా పహానీల్లో కూడా వారి పేర్లు నమోదు కావడం వల్ల రికార్డులు పూర్ణంగా ఉన్నాయని వివరించారు. అయితే, దీనిని అవకాశంగా చూసుకున్న కొందరు అక్రమార్కులు విదేశాల్లో ఉన్న నిజమైన భూ యజమానుల గైర్హాజరీని ఉపయోగించుకుని కుట్రలు పన్నారని ఆయన పేర్కొన్నారు.
1981లో నకిలీ సాదా బైనామాలు సృష్టించి, వాటిని రెగ్యులరైజ్ చేయించుకున్నారని జడ్సన్ ఆరోపించారు. ముఖ్యంగా ఆ కాలంలో సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేసే అధికారాలు తహసీల్దారులకు లేవని స్పష్టంగా చట్టాలు చెబుతున్నప్పటికీ, అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై ఈ అక్రమాలకు సహకరించారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. ఈ చర్యలతో నిజమైన భూ యజమానులకు నష్టం జరిగిందని, ప్రభుత్వ రికార్డులు కూడా తప్పుదోవ పట్టించబడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.
కబ్జాదారులు రైతుల ముసుగులో పెద్ద ఎత్తున భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ నానాయాగి చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై మరియు వాటిని అంగీకరించిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. భూ రికార్డులను శుద్ధి చేసి, నిజమైన యజమానులకు హక్కులు పునరుద్ధరించాలని జడ్సన్ తన అభ్యర్థనలో పేర్కొన్నారు.









