కేంద్ర బడ్జెట్ అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత

కేంద్ర బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వై.వి. భానునారాయణ రావు పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు వృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ (టిఏపిటిబిఏ) ఆధ్వర్యంలో “యూనియన్ బడ్జెట్ 2026 విశ్లేషణ” అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో స్పీకర్ మీట్ నిర్వహించారు.
ఈ సమావేశానికి సీఏ పంకజ్ సంచేటి అధ్యక్షత వహించగా, టిఏపిటిబిఏ కార్యదర్శి సీఏ ఆశిష్ జోషి, కోశాధికారి సీఏ సోమేశ్వర్ నేమాని పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యక్షులు సీఏ నారాయణ రావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రమణ రెడ్డి, కలహస్తి శ్రీనివాస, వెంకట్ రామ్, మాజీ అధ్యక్షులు రామ్‌దేవ్ భూటాడా, హితేష్ జైన్, రితేష్ మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వై.వి. భానునారాయణ రావు మాట్లాడుతూ 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని యూనియన్ బడ్జెట్ మరింత బలపరుస్తుందని అన్నారు. బడ్జెట్‌లో నియమాలు, విధానాల అమలుపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిఘా పెట్టిందని తెలిపారు. సరైన విధంగా బడ్జెట్ అమలు జరిగితే ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రశేఖర్ వేముల మాట్లాడుతూ యూనియన్ బడ్జెట్ దేశ ఆర్థిక దిశను మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తుందని అన్నారు. బడ్జెట్ సరైన అమలుపై సామాన్య పౌరుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. సీఏ సతీష్ సరాఫ్ జీఎస్టీ ప్రతిపాదనలపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఈ సమావేశం ఆర్థిక అవగాహన పెంపొందించడంలో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share