రామగుండం కార్పొరేషన్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పోటీలు, విమర్శలు, ఆరోపణలతో వేడెక్కే ఎన్నికల వాతావరణానికి భిన్నంగా, కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మడిపల్లి విజయ మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
మొదటి వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, విజయ మల్లేష్ వ్యక్తిగత మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే ఆయన ఏకగ్రీవంగా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2026లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి ఏకగ్రీవ కార్పొరేటర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
“ఎన్నిక అంటే ప్రత్యర్థిని ఓడించడం కాదు, ప్రజల మనసులను గెలుచుకోవడమే” అన్న భావనను విజయ మల్లేష్ తన రాజకీయ ప్రస్థానంతో నిరూపించారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధిపై నిరంతర శ్రద్ధ, పేద ప్రజల సమస్యలపై స్పందన, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన తీరే ఈ ఏకగ్రీవ విజయానికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పేదలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఏ సమస్య వచ్చినా ఇతర నాయకుల వద్దకు వెళ్లి పనులు చేయించడంలో ముందుండేవారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ సేవాభావమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి, నాయకులు కూడా ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇచ్చేలా చేసింది. రామగుండం రాజకీయాల్లో ఈ విజయం ఓ అరుదైన అధ్యాయంగా నిలిచింది.









